07 April 2011

వెళ్ళిపో

ఉరుముతున్న దినాలు
ఉరిమే దినాలు

వాళ్ళు ఎవరూ నిన్ను
స్మరించరు
వాళ్ళు ఎవరూ నిన్ను
కాంచరు=
వాళ్ళు: అందరికీ చెందిన
అందరూ అయిన
వాళ్ళు. నిలువెల్లా
నింగీ నేలా
నిప్పూ అకాశాలతో
ఈ భూమిపై తిరిగే
వాళ్ళు: వాళ్ళు ఎవరూ
నిన్ను స్మరించరు.
వాళ్ళే, వాళ్ళు అందరే
నిన్ను విస్మరించారు
నీ ప్రార్ధనలలో
నీ అలాపనలలో నిండి
పోయిన వాళ్ళు
వాళ్ళే నిన్ను
విస్మరించారు=

వెళ్ళిపో ఇక్కడనుంచి
త్వరగా

ఈ ఉరిమే దినాలలోంచి
ఈ తరిమే జనాలలోంచి
త్వరగా
ఇక్కడనుంచి=

an in/decent poem 2.

అతడు ఇలా అన్నాడు:

"నా గురించి ఎదురు చూడకు
ఎందుకంటే
స్త్రీలు నిరీక్షణా ద్వేషులు
నియంత్రణా వ్యసనులు
శరీర వ్యామోహులు:"

ఆమె ఇలా అంది:

"the sun stays still
in your words:

i laughed at
the altar
of your dead cock:"

నేను ఇలా గొణుక్కున్నాను:

నాకు నేను స్వర్గం
ఇతరులు నరకం
పదాల మధ్యలో అవయవాలతో
జొరబడే ఆ ఇద్దరూ
ఎప్పటికీ మానని గాయం:"

ఎవరు చెప్పారు మీకు
ఇది కవితని?

31 March 2011

ఎవరు?

ఎవరు? ఈ ఆదిమ ఆకాశాంతాన

నిన్ను తన అరచేతుల మధ్య
పొదివి పుచ్చుకున్నది ఎవరు?

రాత్రి చుట్టుకుంటున్నప్పుడు
పగలు మిగిలిన
కాంతి కిరణాలు సర్పాలై
నీ నుదుటిని కాటేస్తున్నప్పుడు

నువ్వు కంపిస్తూ
తల దించుకుని నేలని పరికిస్తూ
నేలపై వాలే మసక నీడల
మట్టి జాడలని చెరిపేస్తూ
నువ్వు ఆ గదికి
పారిపోయి వచ్చినప్పుడు
నిన్ను తన అరచేతుల మధ్య
పొదివి పుచ్చుకున్నది ఎవరు?

వానల్లో, కరడు కట్టిన చీకట్లలో
కడుపుని నీళ్ళతో
కుట్టుకుంటున్న రోజులలో
నిన్ను తనలో దాచుకుని
పదిలంగా కాపాడుకున్నది ఎవరు?

నీ పెదాలు పగిలి, నీ కుత్తుక తెగి
నీ స్వరం పిగిలి
ఇక సాగలేక నీ పాదాలు విరిగి
నువ్వు దారి పొడుగూతా
రక్తపు ముద్రికలై పారాడుతున్నప్పుడు
నిన్ను ఎత్తుకుని
ఆ నిర్ధయ సమయాన్ని దాటించి
నిన్ను ఆదుకున్నది ఎవరు?

నూనుగు చంద్రకాంతిలో
కనులు చిట్లే మధ్య రాత్రిలో
అగ్నిలో, ఇతరుల
మంచు మృత్యువులో
మధువులో ఊయలలూగుతున్న
నిన్ను దగ్గరగా లాక్కుని
హత్తుకుని
నిద్ర పుచ్చినది ఎవరు?

నీ హింసకీ నీ విధ్వంసానికీ
నీ నిర్లక్ష్యానికీ
నీ దిగులు పారిజాతాలకీ
తన లోకాన్ని
వొదిలివేసినది ఎవరు?
నీ సంతోషానికీ
నీ మృగమార్మిక వ్యసనానికీ
నీ అవధులు లేని ఉన్మాదానికీ
నీ అంతంకాని
అంతంలేని నైరాశ్యానికీ
తన కాలాన్ని
బలి చేసినది ఎవరు?

నిన్ను వొదలలేకా
నీతో ఉండాలేకా
నిన్ను ద్వేషించాలేకా
నిన్ను మరచిపోయేoతగా
ప్రేమించాలేకా
రెండుశిక్షల మధ్య
మరణించినది ఎవరు?

మరణిస్తూ, నిన్ను
శిలువ వేసి
వెడలిపోయినది ఎవరు?

an in/decent poem

ఆమె ఇలా అంది:

the moon stays still
in our words.

నేను అన్నాను:

i lay my head
at the altar
of your cunt.

ఇద్దరూ ఇలా అన్నారు:

".............
.............."

((నిశ్శబ్దంకి పలు రూపాలు:

ఇప్పటికి అది
ఒక తెల్లటి చీకటి))

28 March 2011

ప్రధమపాఠ౦

చిన్ని చేతులతో, పెద్ద కళ్ళతో
ఎదురుచూస్తావు నువ్వు

ఆడుకోవచ్చని, ఆపై
నా ఛాతిపై పరుండి నిదురోవచ్చని=

అడుగుతావు నువ్వు మళ్ళా మళ్ళా
అమ్మను నీటిబుడగలు పగులుతున్న
నీ తెల్లటి పదాలతో
చెట్ల కొమ్మలలోంచి సాగే
సాయంకాలపు గాలి చల్లదనంతో

వస్తానా నేనని, వస్తే ఎప్పటికని
రాత్రైతే రానేమోనని=

కొంత దిగులు, కొంత గుబులు
కొంత ఆశా, మరికొంత నిరాశా

ఆకాశానికి విచ్చుకున్న
నీ హృదయ పుష్పపు తుషారంలో=

వస్తానా నేను, వచ్చానా నేను
ఎపుడైనా? నీ చాచిన చేతులలోకీ
సుదూరంగా సాగిన
నీ చూపులలోకీ?

ఎదగటం అంటే ఇదే: ఎదురుచూపుల
నిస్పృహను రుచి చూడటం
హృదయ వేదనని నలు దిక్కులలో
గూడు కట్టుకోవడం

నా చిట్టి కన్నా గుర్తుంచుకో:
ఇది నీ జీవితపు
ప్రధమ ప్రేమ పాఠ౦.

26 March 2011

అందాక

నా గురించి ఆలోచించకు
నేను ఎక్కడో ఉండి ఉంటాను: నీ వెనుకగా
నీ చుట్టూ నడయాడే గాలిలా
నిదురలో నిను తాకిన వర్షపు చినుకులా
నువ్ మైమరపుతో
ఆర్పివేయటం మరచిన రాత్రి దీపంలా
నేను ఎక్కడో ఉండే ఉంటాను.

నా గురించి ఆలోచించకు:
ఏం చేయాలో తోచక అలా తిరుగుతూ
పిల్లలని అలా విసుక్కోక
కాసేపు నింపాదిగా కూర్చో:

పగటిపూటి పూవులను రాత్రి దారంతో
నీ నిరీక్షణతో అల్లుకో
గతించిన కాలం, చింతించిన కాలం
అన్నింటినీ ఓ మారు తలుచుకో
శరనార్ధులనూ, శాపగ్రస్తులనూ
కొంతసేపు నీ దయగల
హృదయంలో తురుముకో
కిటికీలను తెరిచి, తలుపులు తెరిచి
గాలికీ, నక్షత్రాల కాంతికీ
నీ వేదనని నివేదించుకో
అందాక నా గురించి అంతగా
ఆలోచించకు

నేను ఎక్కడో ఉండే ఉంటాను
నేను ఎక్కడి నుంచో
వస్తూనే ఉండి ఉంటాను

24 March 2011

నీకు మాత్రమే తెలుసు

ముందుగా, ఒక అంతం: ఒక ప్రశ్న. మనం
ఎందుకిలా?

౧.

నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే
నీ వదనానికి మాత్రమే
నీ నిర్లిప్త పెదాలకు మాత్రమే
అంత క్రూరంగా
అంత నిశ్శబ్దంగా ఉండటం తెలుసు.
నీకు మాత్రమే, ఒక్క నీకు మాత్రమే
జనులకు ప్రేమిస్తూ
నిజానికి ద్వేషిస్తూ ఉండటం
నీకు మాత్రమే తెలుసు. ఇది నాకు చెప్పు:

నువ్వు ఈ కళను ఎక్కడ అభ్యసించావ్?

౨.
రెండో వినతి: ఇది కవిత కాదు.
ఈ వాక్యాలలో నివిసించేది, ఈ పదాల మధ్య
తిరుగాడేది జ్ఞానం కాదు.

((అర్థరాత్రికీ ఇళ్ళకి చేరని పక్షులు
నీకు తెలుసా?
మధ్యరాత్రిలో, నిండు పున్నమిలో
వెన్నెలలోని చీకటిని నింపుకుని
రాలిపడే మల్లెమొగ్గలు
నీకు తెలుసా?
ఉదయమంతా, చీల్చివేసే ఎండలో
నీటితో కడుపుని నింపుకుని
అరచేతులో కళ్ళని పట్టుకుని
అలా ఎదురు చూసే మనుషులు
నీకు తెలుసా?

స్త్రీలు తెలుసా?
వారి మోహాలూ, వారి శాపాలూ
అంతంలేని వారి ప్రతీకారాలూ
వారి ప్రతీకాత్మక దేహాలూ
నీకు తెలుసా?))

౩.

మూడోవ, మొదటి సత్యం: నాకు
"సామాజికత" లేదు. నాకు
నా సత్యం తప్ప ఇతర నిజమూ లేదు.

((కాబట్టి, నువ్వు తలుపు తెరిచినప్పుడు
నీ వదనం మూసుకుంటుంది
కాబట్టి, నా పెదవులు పలికినప్పుడు
నీ స్వరం నల్లటి శిలగా మారుతుంది:
ఇదే సమయం. ఇదే
సరైన సమయం:

పూవులు రాళ్ళుగా, రాళ్ళు ముళ్ళుగా
ముళ్ళు మనంగా మారే
క్రియ గురించి, ప్రక్రియ గురించి
మాట్లాడుకునేందుకు.))

౪.

మధ్యలో ఒక జవాబు: ఎందుకిలా మనం
ఎప్పటిదాకా ఇలా మనం?

((వివశితుడను. అతి వ్యసనుడను
మధ్యమార్గం తెలియని
మధ్యవయస్కుడను.
పిల్లలు ఉండి ఇంకా "తండ్రిని" కాని వాడను
తండ్రి ఉండి ఇంకా "కొడుకుని" కాని వాడను
భార్య ఉండి ఇంకా "భర్తను" కాని వాడను
విషాదుడను, వ్యామోహ, మొహావేశాలు
వేషాలు లేనివాడను
అంతిమంగా నీకు అత్యంత ప్రియమైన
శతృవును, శాపగ్రస్తుడను
నీ ద్వేషాన్ని ద్వేషించే ప్రేమ కలవాడను))

మరలా మరలా మరొకసారి: ఇది
మీరు ఊహించే, మీరు కోరుకునే కవిత కాదు
ఇవి జ్ఞానం తిరుగాడే పదాల ప్రదేశం
దేహం దేశం కావు

వెడలిపోండి ఇక్కడనుంచి.

౫.
ఉన్నాను, నీ కటిన వదనానికి
నీ నిశ్శబ్దాల నీడలకీ ఒక కాందీశీకుడనై=
వేచి ఉన్నాను, నీ జ్ఞాన విముక్తికీ
దరిచేరని నీ మహా కధనానికీ
ఉన్నాను, నీ నిస్సహాయతకీ
నీ నిర్మాణాల వినిర్మాణానికి ప్రేక్షకుడినై=

మరేం లేదు ఇక్కడ, మరేం కాదు ఇక్కడ
త్వరగా దరికి రా

కలసి చనిపోదాం ఒకింత దయగా
ఒకింత శాంతిగా.