19 March 2011

దాచుకో

ఉదయం పలు రంగులతోనో లేక
ఒకే ఒక నిస్పృహతోనో విచ్చుకునేటప్పుడు
నేను నీకు ఒక పూవును తెస్తాను
నేను నీకు తప్పక ఒక పసుపచ్చని
పేరు తెలియను పూవును
మట్టి నిండిన దారిలో
అయోమయంగా ఎదిగిన గడ్డిలో
పూసిన ఆ పూవును
నీకోసం తెంపుకు వస్తాను=

నేను ఇక ఇప్పుడు నీకు
ఇవ్వగలిగినదేమీ లేదు

ఎవరో లేత ఎరుపు చేతివేళ్ళతో
పదునైన గోళ్ళ అంచులతో తుంపివేసిన
శిరస్సువంటి
పసుపుపచ్చని పూవువంటి
నన్ను తప్ప
నేను నీకు ఇక
ఇవ్వగలిగినదేమీ లేదు=

కొద్దిగా నీళ్ళు వొంపుకుని
నీ హృదయంలో దాచుకో
ఈ దారి తప్పిన పూవునూ
ఈ దారి మరచిన
పసుపు పచ్చని పిట్టనూ=

18 March 2011

ఎక్కడ ఉన్నావు?

ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావో అడగను. ఏం చేస్తున్నావో అడగను. సూర్యుడు ఒక ఇనుప దిమ్మస వలె దినాన్ని మోదుతుండే ఈ కాలంలో కడుపు నిండా మంచి నీళ్ళన్నా తాగావా, కాస్తంత అన్నం నిన్నటిధైనా కడుపున దాచుకున్నావా అని అడగను. కళ్ళు చికులించుకుని రావాల్సిన స్నేహితుడికోసం ఎదురుచూస్తున్నావా, ఎవరో వొదిలివేసిన ఈ లోకంలో ఎవరి కోసమూ నువ్వు నటించలేక ఎవరూ నీకోసం రాక ఒక్కడివే ఎప్పటిలా నీ ఒంటరి ఏకాకి గదిలో శిధిలమయ్యావా అని అడగను. చాపమీద పరుండి, దేహద్రిమ్మరులూ దేశద్రిమ్మరులూ, దేశద్రోహులూ దేహద్రోహులూ, ప్రేమికులు పాపులూ శాపగ్రస్తులూ నిరాకారులూ నిర్దయప్రాణులూ ఉన్మాదులూ స్త్రీలూపురుషులూ ఎవరికీ చెందని రాణులూ వారి రాత్రుల్లూ సంధ్యా సమయాలలో ఇళ్ళు వొదిలి వెళ్ళే రాజులూ రహదారులూ రహదారుల రహస్య చీకట్లలోతిరిగే మరణించే భిక్షగాళ్ళూ కవులూ కిరాయి హంతకులూ,హతులూ హతుల స్వప్నాలూ నీ నయనాలూ అన్నింటినీ వాటన్నిటినీ అలా చిరిగిపోయిన చాపమై పరుండి చూస్తున్నావా అని అడగను. ఏమీ అడగను. బ్రతికి ఉన్నావా, క్షణక్షణం నీ నీడల దారులలోకి పారిపోతున్నావా ఒక అనామక స్త్రీలోకి ఏడుస్తో కుంగిపోతున్నావా పిగిలిపోతున్నావా నలుమూలలకి చెదిరిపోతున్నావా అని అడగను. ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క ప్రశ్న:

నేను బ్రతికీలేను, నేను చనిపోయీ లేను

నువ్వు ఎక్కడ ఉన్నావు?

ఏడు రంగుల ఏడు గంటల రాత్రి

ఏడు రంగులు, ఏడు గంటలు
ఇక ఈ రాత్రి అంతమవుతుందో లేదో తెలియదు

కూర్చున్నాం కదా
ఎదురెదురుగా, మనలోని ఏడు లోకాలతో
కళ్ళలోని ఏడు సముద్రాలతో

ఏడు ఎడారులు కలగలసిన, మన ఎండిన
హృదయాలతో=

మాట్లాడుకోవాలి కదా
పంచుకుని ఇక్కడో, ఎక్కడో రాలిపోవాలి కదా

మన దేహాలపై ఈ సమయపు
ఆకుపచ్చని చినుకుల్ని వొంపుకుని, తెల్లటి
గాయాల్ని నిమురుకుని

ఎర్రని దాహంతో, నల్లటి కోరికలతో
జన్మాంతం తీరని పసుపుపచ్చని తపనతో మనం
ఒకరిలోకి ఒకరం దూసుకుపోవాలి కదా

అందుకై కలుస్తాం ఇక్కడ
ఈ మంత్రధనుస్సుతో, ఇంధ్రనగరిలో, పాత్రల నిండా
మెరిసే నక్షత్రాల మెరుపులతో
గలగలలతో, అలలతో మైమరపు మాటలతో=

ఇక ఈ ఏడు రంగుల ఏడు గంటల రాత్రి
అంతమవుతుందో లేదో ఎప్పటికీ తెలియదు

16 March 2011

ప్రధమ ప్రేమ పాఠ౦.|| collage poems*7||

నేరస్థలం నీ దేహం

శూన్యంలో శిలా విగ్రహమై
ఓ మాట అంటావు

నిర్మిత దేహాలకూ, నిర్మోహ
వాక్యాలకూ
కన్నీళ్లను తుడుస్తున్నాను

జంట కుదరక
జలనిధిలోకీ, విశ్వపు
అద్దంలోకీ
పారిపోతున్నాను

ఇదంతా, నీ ప్రధమ
ప్రేమ పాఠ౦.

నెమ్మదిగా నిదురపో,
నీ నిదురలో
ఆ కనులలో ఒక పూవు
ప్రసవిస్తోంది దయగా=

______________________

"collaged"from Mo's Nishaadham.

నీ ద్వేషం (ఒక తొమ్మిది కా/రణాలు) లేదా కవిత కాని గాధ ఒకటి

నీ ద్వేషం, ఒక పరంపర వలె, శీతాకాలం సాయంత్రం మసక చీకటీ కలగలిసి కురిసిన ఒక తుంపర వలె, నన్ను ఒక దిగులు గదిలోకి దయలేని మదిలోకీ నెడుతోంది. నీ ద్వేషానికి, ఇప్పటికి నాకు తోచిన నువ్వు చెప్పక చెప్పిన ఒక తొమ్మిది కా/రణాలు:
***
1. మొదటిగా, చివరిది అయిన చిన్న కారణం: నేను ఉండటం. నేను నీ ద్వారా ఉనికిలోకి రావడం. 

2. రెండొవది ఏమిటంటే, నేను కవిత్వంవంటి దానినేదో రాయటం, దానిని నేను కవిత్వం అని నమ్మకపోవడం. 

3. నేను నేనుగా ఉండటం, అందులో భాగంగా నేను నిన్ను నిర్దయగా ధిక్కరించడం. (నీకు తెలియని ఒక విషయం: నా కోసం, నేను నేనుగా ఉండటం కోసం, అందుకై అలవాటైన స్వీయ హిం సకోసం, ఇప్పటికి తొమ్మిది మంది స్త్రీలను దేశంలో, దేహంలో, పరదేశాలలో, పరదేహాలలో వొదిలివేసాను. (*ఇప్పటికీ ఈ హృదయంపై తొమ్మిది కోతలు ఉన్నవి, ఇప్పటికీ అవి ఉబుకుతూ ఉన్నవి)

4. పురాజన్మలో తగిలిన శాపమొకటి వెన్నాడుతోన్నది ఊరూ పేరూ లేని ఓ దిగులై, ఓ తపనై ఈ జన్మలో : నీకు తెలియని ఆ పాదాలపూల పరిమళ నైరాశ్యమై నన్ను వివశితుడను చేస్తోన్నది. తిరుగుతున్నాను అందుకే, ద్రిమ్మరినై, దారులవెంటా, మట్టి అంటిన మనిషి పాదాలవెంటా.  రాలిపోతున్నాను నీటి చుక్కనై, పగిలిన పెదాలపైనా, పుసి పట్టిన కళ్ళలోనా, రహదారుల్లోనా, రహస్య మధుశాలల్లోనా హంతకుల రతి మైదానాలల్లోనా, అపరిచిత స్త్రీల బాహువులల్లోనా, రాలిపోయే నక్షత్రాల కరిగిపోయే రాత్రుళ్ళలోనా -

( నీకు తెలుసు నేను గూడుని నమ్మని గూడుకై వెదుకులాడుకునే ఒక గూడు లేని పక్షిని అని )

5. భర్తను కానీ, తండ్రిని కానీ కొడుకును కానీ పౌరుడిని కానీ మరొకరి పాత్రల పౌరోహిత్యం నిర్వహించే పురో/హితుడను అయ్యే పాపాన్ని చేయలేకున్నాను. అటువంటి పుణ్యం చేసుకుని ఉన్నాను: ఇందుకు - నువ్వు నన్ను ద్వేషించాలి: ఇంతకు వినా నీకు మరో మార్గం లేదు.

6. బానిసవలె పెంచబడి బానిసగా మారలేకున్నాను. నీ భాష్యపు దాస్యంకింద నువ్వు నమ్మి పెంచుకుని స్థాపించిన విగ్రహాలముందు మోకరిల్లలేకున్నాను. కాదా ఇది ఒక నేరం: నేరాలను శిక్షించే నేరస్థుడని నేను. చాలదా ఇది నన్ను ద్వేషించెందుకు నీకు ఆరో కారణం?

7. ప్రేమించలేను. శరీరం నచ్చకుండా రమించలేను. భాష లేక శరీరం లేదు. భావంలేక ప్రాప్తి లేదు. జీవం లేక శాస్త్రం లేక జీవశాస్త్ర ఉనికి లేక నువ్వు అనుకునే నువ్వూ, నీ పరమ అధ్బుతమైన, స్త్రీ లేదు. ఈ పదాలకి ఒక లయా లేదు. అంతిమంగా నీ ద్వేషానికీ దయా లేదు. పద సన్నిధీ లేదు. అందుకే వెడలిపోతున్నాను ఇక ఈ వాక్యాలలోంచి:

8. నీ విద్రోహాల నీడను పంచుకోలేకున్నాను. మన్నించు: నిన్ను మినహా శత్రువులవంటి మొగలి పూల పరిమళపు స్నేహితులను నమ్ముకున్నాను. బృంద గానాలను ఆలపింపలేకున్నాను. ఇతరులకై నన్ను నేను పారవేసుకున్నాను. చేయి దాటిపోయింది. దూరం ఏదో చేరువయ్యింది. దరి చేరనిది దాహమై ముంచివేసింది. ఇక మరణించేవరకూ ఉన్నాయి: నీకు నీ మరణం, నాకు నా మరణం. 

( ఇక మరణించేవరకూ, నేను నీ మరణం నువ్వు నా మరణం.)

9. మొదటిది అయిన చివరి కారణం: నేను నీ ప్రతిబింబపు ప్రతిబింబం: అద్దంలోంచి అద్దంలోకి తొంగిచూసే అద్దపు ప్రతిబింబం. ఎదురుచూపు మనం. తన మనం. అందుకే ద్వేషించు చివరిదాకా, కంటిచూపు సాగేదాకా: తరువాత, ఆ తరువాత, ఆ తరువాత తరువాత కలుస్తాయి మన చేతులు మరెక్కడో: అనంతంలో! 
***
నీ ద్వేషం, ఒక పరంపర వలె శీతాకాలం సాయంత్రం మసక చీకటి కలగలిసి కురిసిన ఒక తుంపర వలె నన్ను ఒక దిగులు గదిలోకి దయలేని మదిలోకీ నిరంతరంగా నెట్టివేయనీ, వొదిలివేయనీ!

14 March 2011

నీ ద్వేషం

నీ ద్వేషం రెపరెపలాడుతుంది
తెల్లటి ఎండవలె, అది నన్ను అంధుడిని చేస్తోంది.

ఎందుకు ద్వేషిస్తావు నన్ను? నాకు తెలుసు
ద్వేషించేందుకు చాలా ధైర్యం కావాలని
ద్వేషం ప్రేమంత శక్తివంతమైనదని=

నాకు తెలుసు: ఎక్కడా ఒదగని తనాన్ని
భరించటం అంత తేలిక కాదు
నాకు తెలుసు: నిన్ను నిర్మించినదానినంతా
నెమ్మదిగా తుడిచివేసే తనాన్నీ
నువ్వు బ్రతకాలనుకుని, బ్రతుకలేక
రాజీపడిన నీ అద్దాన్ని
కరిగించివేసి, నిన్ను తీసివేసే తనాన్ని
భరించటం అంత తేలిక కాదు=

నేను నీ వంక నిస్సహాయంగా చూస్తాను
రెండు వడలిపోయిన
చేతులుగా మారిన కళ్ళతో, ఎప్పటికీ నీకు
ఒక కొనసాగింపు కాలేని ధిక్కారంతో:

నీకు ఇక ఎప్పటికీ తెలియదు
మనం జన్మాంతం ఎందుకు జీవించామో
మనం జన్మాంతం ఎందుకు
పరచిత అపరిచితులుగా మిగిలిపోయామో=

నన్ను శాంతితో మరణించనీ.

07 March 2011

ఒంటరితనంలో ఒక్కడు

ఒంటరితనంలో ఒక్కడు
మోకాళ్ళు చుట్టూ చేతులు చుట్టుకుని
చీకట్లో, చినుకుల్ని వింటూ
ఒంటరితనంలో ఒక్కడు

ఒంటరితనంలో ఒక్కడు
చెక్కబల్లపై ఒక ప్రమిదెను వెలిగించుకుని
చిరు చీకట్లో, చిరు చిరు
వలయపు కాంతిలో, చెట్టులా మారి
గూళ్ళు వొదిలిన పక్షులను
కళ్ళలో నింపుకుని మౌనంగా
ఒంటరితనంలో ఒక్కడు

ఒంటరితనంలో ఒక్కడు
చీకట్లో, వలయపు వెలుతురులో
చినుకుల అందియలలో
ఒక మధుపాత్రతో

దీపపు కాంతిలో వెలిగే
ఒక మహిమాన్విత స్త్రీ వదనపు
నలుపు చారికను తదేకంగా
పరిశీలిస్తూ
ఒంటరితనంలో ఒక్కడు

ఒంటరితనంలో ఒక్కడు
అక్కడే, తన చుట్టూతా తన లోపల
వలయాలుగా తిరుగాడుతూ
మారుతున్న గాలినీ, జారుతున్న
వర్షాన్నీ, చేజారిన క్షణాలనీ
అరచేతుల్లో నింపుకుని
కనులు మూసుకుని తలనిండా
మది నిండా ఒంపుకుంటూ
ఒంటరితనంలో ఒక్కడు
ఒంతరితనంతో ఒక్కడు

ఒంటరితనంలో ఒక్కడు
పిల్లలలో తప్ప, ఏమీ తెలియక
కుంటుకుంటూ తిరుగాడే
వీధి కుక్కలలో తప్ప
ఒక ప్రసన్నమైన సూర్యకాంతిలో
అలా దిగులుగా మెరిసిపోయే
నీడల కదలికలో తప్ప
ఇతరులలో తనని కనుగొనని
ఇతరులలలో తనని
ఇక ఏమాత్రం కనుగోనలేని
ఒంటరితనంలో ఒక్కడు

ఒంటరితనంలో
తను లేని తనంలో, ఒంటరిలో
అంతిమ పద దర్శనానికీ
ఆదిమ మంత్ర దర్పణంలో
మృత్యు శ్లోకాలను అల్లుకుంటూ
ఒంటరితనంలో, ఆ
ఒంటరితనంలో ఒక్కడు
ఒకే ఒక్కడు=