27 October 2014

i thirst.

ఇదొక దాహం.
పూలను పంచి, ముళ్ళని త్రాగే దాహం
హృదయాన్ని ఇచ్చి, భిక్షాందేహీ అంటూ నీ ముంగిట నిలబడే దాహం-
నీ చుట్టూతా

పిచ్చుకలై ఎగిరే దాహం -
రిఫ్ఫ్ రిఫ్మనే ఆ రెక్కల కలకలంలో కలవరపెట్టే దాహం
సీతాకోకచిలుకలై నీ కనుల అంచుల్లో వాలి, నిన్నే చూస్తుండిపోయే దాహం
వానచినుకులై

నీలో ఇంకిపోయే దాహం
నీడలై నీపై తార్లాటలాడే దాహం. నీపైకి వొంగి
అప్పుడప్పుడూ నిన్ను లేత ఎండలానో, తుఫాను తీవ్రతతోనో తాకే దాహం
తీరం లేని దాహం

నన్ను గుప్పిళ్ళతో అందుకుని
రాత్రుళ్ళలోకో, రాత్రి మనుషులలోకో వెదజల్లే దాహం
నీలోకో, తనలోకో, పిల్లల నిదురలోకో, ముసిలివాళ్ళ అరచేతుల గీతల్లోకో
నన్ను త్రోసివేసే దాహం

ఇదంతా
ఒక సంరంభం. ఒక మొదలూ, ఒక అంతం.
ఒక జననం, మరొక మరణం. మరలా మరలా పునరుజ్జీవనం. మరలా మరలా
శిలువ వేయబడటం -

ఇదంతా
కొంత వొదిలి వేయబడటం
కొంత ఎదురుచూడబడటం. కొంత అలసిపోబడటం. కొంత విసిగిపోబడటం-
అంతిమంగా, ఆత్మ ఎండిపోయి

ఇట్లా, మట్టికుండలాంటి
నీకై- ఒక ఖాళీ గాజుపాత్రనై - గాలికి నేలపై దొర్లుతూ వేచి ఉండటం
నాలోపలి వ్రూమ్మంటో తిరిగే గాలిని

నేనే వినడం. నేనే కనడం
నాలోపల నేనే పొదిగి పొదిగి, దాహం అయ్యి తిరిగి దారి తప్పి పోవడం
మళ్ళా, మొదటి నుంచి మొదలు పెట్టడం
తిరిగి వలయమవ్వడం
కరిగిపోవడం
బిందువుగా
మారిపోవడం.. 

అవును
మరి నువ్వన్నది నిజంగా నిజం.
అరచేతులని అరచేతులు తాకలేనంత దూరంలో
ఎదురెదురుగా ఉండి కలవలేని ఒక నిర్ధయమైన కాలంలో, లోకంలో
కాంతి లేని ఈ సీమలో

I thirst.
Truly.
నిజంగా ఇదొక దాహం!

24 October 2014

tetelestai

ఒక శంఖం:
నిదురించే శిశువు వంటిది. దాని లేతెరుపు
పిడికిలి వంటిది. నీ
హృదయం వంటిది-

మరి నీ హృదయాన్ని
దాని హృదయం దగ్గరగా ఆన్చినప్పుడు
నీకు వినవచ్చేదేమిటి?

సముద్రపు తీరాలలో
రాత్రుళ్ళల్లో కొట్టుకువచ్చే వెన్నెల నురగ.
మెరిసే నక్షత్రాల అనంతాల దూరం.
ఇంకా, ఇసుక సవ్వడీ, ఉప్పు వాసనా-

మరి ఆ కన్నీళ్ళూ, ఆ ఉప్పదనమూ
ఎవరిదీ అని అడగకు.

కొన్నిసార్లు అది ఇసుకది
కొన్నిసార్లు అది అలలది
కొన్నిసార్లు అది, జాలరి వలలో చిక్కుకున్న చేపదీ
చిక్కుకోలేని ఆకాశానిదీ

చివరిగా,  తరచూ - నీదీ, నాదీ.

సరే, సరే
ఇంకెప్పుడూ అడగను:
నీ శరీరం ముందు ఈ శంఖాన్ని ఎప్పుడూ ఉంచను-
నిన్ను వినమనీ, దాని పసి నిద్రలోకి రమ్మనీ
నిన్ను ఎన్నడూ వేడుకొను.

తెలియదా నీకు

ఈ శంఖంలో
దాని హృదయంలో
సీతాకోకచిలుక వలే రెక్కలల్లార్చే చీకటిలో
ఒక లేతెరుపు గులాబీ మొగ్గ దాగి ఉందనీ
నిన్ను చూచినంతనే

అది వికసిస్తుందనీ
అది నిన్నే శ్వాసిస్తోందనీ
అది నిన్నే స్వప్నిస్తోందనీ - అదే నువ్వై - నీ పదమై ఆగి ఉందనీ?

tetelestai.
ఇక నిన్నెప్పుడూ కదపను!

20 October 2014

పొదగబడి

అట్లా అని పెద్దగా ఏమీ లేదు -

గోడల వెంబడ పాకి, చప్పున ఆగి సహనంగా చూసే ఒక బల్లి.
దాని కింద నేలపై, ఊగే నీడలు.
కొంత మట్టి తడచిన వాసన -

నీళ్ళు చిలుకరించినట్టు, గదులలోంచి మాటలు.
కుండీలో ఆకులు కొద్దిగా కదిలే శబ్ధం.
నిన్ననే పుట్టిన పావురపు పిల్లపై, ఆ
తల్లి పావురం సర్దుకుని కూర్చునట్టు

ఇది ఒక రాత్రి.
ఒక లేత మంట ఏదో అలుముకున్నట్టు
దాని రెక్కల కిందకు నేనే ఒదిగినట్టు
ఎవరో నన్ను పొదుగుతున్నట్టూ, నువ్వు హత్తుకున్నట్టూ

నీ ఛాతిలో దాగిన ముఖానికి నువ్వు ఏదో చెబుతున్నట్టూ
కనురెప్పలపై మునివేళ్ళతో రుద్ది
నులివెచ్చని కలల లోకాలలోకి
నీ శ్వాసతో ఊయలలూపి
తేలికగా వొదిలివేస్తున్నట్టూ-

ఇక
ఆ తరువాత ఏం ఉంటుంది?
అట్లా అని

అన్నీ ఉండాలనేం లేదు. నువ్వూ, నేనూ, ఒక గూడూ
పక్షి రెక్కల కింద పగలని గుడ్డూ
నీడల్లో మెరిసే కాంతీ, కరుణా
ఇంకా, నేను చెప్పలేనివి ఎన్నో-

మరి ఇది నిజం చిన్నా
గోడపై వాలిన తూనీగను చప్పున ఒక బల్లి నోట కరచుకోగా
కళ్ళు తెరవక, గూటిలోంచి రాలిపోయి
గిలగిలా కొట్టుకులాడుతుంది

పస్థుతానికి ఈ 'జీవితం'- ఇక
ఎవరైనా "ఎలా ఉన్నావూ?" అని హటాత్తుగా అడిగితే
"నేను బావున్నాను"

అని నువ్వో, నేనో ఎలా చెప్పడం? 

17 October 2014

ఒకమరొకసారి

నీటిలోని కాంతిని తాకలేను
నీడలు ముసిరే వేళల్లో, బరువుగా ఒరిగిన నీ కనురెప్పల కింది
కనీళ్ళను చూడనూ లేను -

చీకటి చెట్ల కింద తల వంచుకుని
నువ్వలా, నేనిలా నుల్చుని...
మన అరచేతులు ఆనీ ఆనక

మన చేతివేళ్లు తాకీ తాకక
కలిసి ఉండాలేకా, విడిపోనూలేకా, ఏమీ
చెప్పుకోనూ లేక, చెప్పరాక

ఇక
లోపలంతా చెక్కుకుపోయి, తెగిపోయి, మౌనంగా
ఒకరి తలను మరొకరి గుండెకేసి
మోదుకునీ, బాదుకునీ, ఏడ్చీ...

చిన్నమ్మా
పగుళ్ళిచ్చి, హోరున కురిసిన ఆ రాత్రి
ఇంకా ఇప్పటికీ
ఇక్కడ తెల్లవారనే లేదు - 

15 October 2014

అమ్మ కళ్ళు

చీకట్లో వెలిగించిన రెండు దీపాల్లా వెలుగుతాయి, నీ కళ్ళు-

స్థాణువైపోతాను ఇక నేను.
రావి చెట్లు గలగలా వీచినట్టు, చల్లని గాలి ఏదో నా లోపల.
ఇన్నాళ్ళూ నేను చూడటం మరచిన

వెన్నెల ఏదో, నేను వినలేని వాన ఏదో
నక్షత్రాలు మెరిసే ఆకాశం ఏదో, పూలు వీచే పరిమళం ఏదో
పసి పసిడి పవిత్రత ఏదో

ఇంత వయస్సులోనూ
ఇంత కటువైన నీ చివరి కాలంలోనూ, నీ కనుల సమక్షంలో
అత్యంత లాలిత్యంగా, అత్యంత నిర్మలంగా -

ఇప్పటికీ ఆ కన్నుల్లో ఎక్కడా
నైరాశ్యపు జాడ లేదు, ఓటమి ఛాయ లేదు
జీవించడం పట్ల ద్వేషం లేదు, ఇతరుల పట్ల నిందారోపణ అసలే లేదు-
ఇక

మంచు తెరలు తేలిపోతున్నట్లు ఉండే
ఉదయపు లేత కాంతిని ప్రతిఫలించే ఆ తెల్లని కళ్ళను చూస్తూ
"అమ్మా ఇది ఎలా సాధ్యం?" అని
నేను విస్మయంతో అడుగుతానా

సరిగ్గా అప్పుడే, సరిగ్గా ఆ క్షణానే

వేపాకులు రాలే చెట్ల కింద
ఆ శీతాకాలపు గాలిలో, ఆ సంధ్యాసమయంలో, కాంతి పుంజాలు
నీడలతో కలబడే వేళల్లో, రాత్రిగా మారే
ఆ ఇంటి గుమ్మం వద్ద నుంచి

చిన్నగా నవ్వి,  ముడతలు పడ్డ ముంజేతితో తన కళ్ళని తుడుచుకుని
నా భుజం తట్టి, చిన్నగా
లేచి వెళ్ళిపోతుంది తను!

11 October 2014

ఒక క్షణం

అప్పుడు, నీ కన్నులు లేతెరుపును అద్దుకుంటాయి
అప్పుడు, నీ ముఖంపై మబ్బులు కమ్ముకుంటాయి
అప్పుడు

నీ శరీరంపై ఏవో పేరు తెలియని చెట్లు హోరున వీయగా
ఆ చల్లటి గాలిలోనీ కాళ్ళూ చేతులకు పైగా
పక్షులూ సీతాకోకచిలుకలూ తేలిపోతాయి

అప్పుడు
నీ చెవులలో పురాతన కథల గుసగుసలు
గుర్రాలూ, గూళ్ళూ, ఎగిరే ఎన్నెన్నో చేపలు-
నీ పెదాలపై పాల వాసనా, బుగ్గలపై మెత్తగా

ముద్దులు. మూసుకునే నీ చేతివేళ్లల్లో
ఒక తల్లి శిరోజాలు. తన కలలు నీవై
నీ కలలు తనవై, తన తనువై, వెరసి

ఒక మొగ్గ, ఒక పూవుని కావలించుకుని పడుకునే
ఒక దైనందిన ఇంద్రజాలం. చూసే నాలో
జీవించడం పట్ల ఒక ఇష్టం. ఒక కృతజ్ఞత-

అవును. అప్పుడు

నిద్ర జల్లు కురిసే వేళల్లో, ఆ చినుకుల్లో తడుస్తూ
మీ ఇద్దరినీ చూస్తూ, ఎన్ని రాత్రుళ్ళు బ్రతికానో
నేను ఇంకా బ్రతికే ఉన్నానని గ్రహించానో

ఇంతకూ ఎన్నడైనా చెప్పానా నేను
నన్ను పూరించే మీకు?

08 October 2014

నిశ్శబ్ధం

"నిశ్శబ్ధం అనేది ఉందా అసలు?"
అని అతను, తనని తాను ప్రశ్నించుకున్నాడు-

ఎదురుగా గోడలపై, లతల వలే జారే వాన నీళ్ళు.
ఒక పసివాడి తలని నిమిరినట్టు
నిన్ను లాలనగా నిమిరే ఓ గాలి

నీడలు లేని ఒక కాంతి అప్పుడు నీలో: నీ ప్రాంగణంలో-
మౌనముద్రలో ఉన్న బుద్ధుని
ఛాయాచిత్రాన్నేదో నీకు జ్ఞప్తికి
తెచ్చే చెట్లూ, పూలూ, ఆకులూ-

అక్కడక్కడే ఎగిరి నీ పక్కగా వాలే ఒక తూనీగ: ఇక
ఎవరో నెమ్మదిగా నీ పక్కగా చేరి, నీలో
కుదురుకుని కూర్చున్నట్టు ఉండే

సాయంత్రంలో, సరిగా అప్పుడు కొంత కలకలం. సరిగ్గా
అప్పుడు కొంత, కదలిక లేని కదలిక-
కుండీలో పెట్టిన రెండు గుడ్లపై మళ్ళా
సర్దుకుని కూర్చునే ఒక పావురం
ఒక తల్లీ, పిల్లలూ, నక్షత్రాలూనూ-

ఇక అప్పుడు, సరిగ్గా అప్పుడు, వాటన్నిటినీ చూస్తూ కూడా
వాటన్నిటిలో నిమగ్నమయ్యి కూడా
"నిశ్శబ్ధం ఉందా అసలు?" అనతను
తనను తాను కానీ, తనలో మిగిలిన 

ఆమెను కానీ, ఎలా ప్రశ్నించగలడు?